
- గతేడాది దవాఖానలు, బస్టాండ్ల వద్ద ఏర్పాటు చేసిన వాటర్‌బోర్డు
- ఎండలు దంచి కొడుతున్నా ఆ ఆలోచనే లేదు
- పాత క్యాంపుల్లో వేస్ట్‌గా పడి ఉన్న ఫ్రిజ్ లు, కూలర్లు.
- బాటసారులు, డ్రైవర్లు, ప్రయాణికులు, బిచ్చగాళ్ల తిప్పలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు చౌరస్తాలు, బస్టాండ్లు, దవాఖానల వద్ద చల్లని తాగునీరందించే వాటర్‌బోర్డు చలివేంద్రాలు కనిపిస్తూ ఉండేవి. గత వేసవిలోనూ వాటర్‌బోర్డు మార్చి మొదటి వారంలోనే చాలాచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతోమంది దాహాన్ని తీర్చింది. క్యాంపుల్లో బోర్డు సిబ్బందిని, అధికారులను భాగస్వాములను చేసి విజయవంతంగా నడిపించింది.
కానీ, ఈసారి మార్చి నెల ముగుస్తున్నా వాటర్క్యాంపుల జాడ కనిపించడం లేదు. దీంతో గత ఏడాది ఏర్పాటుచేసిన చలివేంద్రాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అందులో ఏర్పాటు చేసిన రిఫ్రిజిరేటర్లు పనికి రాకుండా పోతున్నాయి.
క్యాంపులకు తాళం
గత ఎండాకాలంలో వాటర్‌బోర్డు ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో కుండలకు బదులుగా వాటర్కూలర్లను ఏర్పాటు చేశారు. రోడ్లపై వెళ్లే వారికి, బిచ్చగాళ్లకు, ప్రయాణికులకు, ఆటోడ్రైవర్లకు చల్లని నీటిని అందించారు. ముఖ్యంగా బస్టాండ్లు, దవాఖానల వద్ద ఏర్పాటు చేయడంతో పేషెంట్ల బంధువులు, దవాఖానకు వచ్చే రోగులు చల్లని నీళ్లు తాగగలిగారు.
సిటీఓని బంజారాహిల్స్రోడ్నంబర్1 బస్టాండ్ వద్ద, బసతతారకం క్యాన్సర్హాస్పిటల్, నాంపల్లి, కోఠి, టాంక్బండ్, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్‌స్టేషన్, పంజాగుట్ట, మెహదీపట్నం, చార్మినార్ వంటి అనేక ప్రాంతాల్లో కలిపి మొత్తం 65 పాయింట్లలో వాటర్‌బోర్డు చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ క్యాంపులన్నీ తాళాలు వేసి కనిపిస్తున్నాయి. కొన్నింటిలో కూలర్లు, డ్రమ్ములు పడావ్పడి ఉండగా, మరికొన్ని క్యాంపుల నుంచి కూలర్లను బోర్డు ఆఫీసుకు తరలించారని సిబ్బంది చెప్తున్నారు.
వచ్చే నెల ప్రారంభిస్తాం
వాటర్ బోర్డు చలివేంద్రాలు ఏర్పాటు కాని విషయాన్ని బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా బోర్డు ఆపరేషన్స్ డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ విషయం తమ పరిశీలనలో ఉందన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో తిరిగి వాటర్ క్యాంపులను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. గత ఏడాది ఎక్కడెక్కడ ఏర్పాటు చేశామో వాటితో పాటు, అవసరమైన చోట్ల కొత్త క్యాంపులను కూడా ప్రారంభిస్తామన్నారు.